prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 5:29 pm Digital Edition : PRAJA VANI

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం*

*స్టేషన్ ఘనపూర్ కు 8 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు – ఇప్పటికే 4 పూర్తి, మరో 4 త్వరలో ప్రారంభం*

*స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో రూ. 2.45 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సబ్ స్టేషన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, పూజా కార్యక్రమాల అనంతరం విద్యుత్ సరఫరాను లాంఛనంగా పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతులను పటిష్టం చేసేందుకు 8 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఫతేషాపూర్ తో కలిపి 4 సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 4 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

సబ్ స్టేషన్ల నిర్మాణంతో పంట పొలాలకు సాగునీరు అందించే మోటార్లు కాలిపోకుండా, వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపడమే తన ధ్యేయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్థానిక సర్పంచ్ సుజాత, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.