prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 9:57 am Digital Edition : PRAJA VANI

స్కూల్ రోడ్డే ఆక్రమణల అడ్డా!

స్కూల్ రోడ్డే ఆక్రమణల అడ్డా!

విద్యుత్ మీటర్ల మంజూరుపై అనుమానాలు.. ఎలక్ట్రికల్ అధికారుల సమాధానం ఎక్కడ?

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):
కూకట్‌పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణలతో కిక్కిరిసిపోతోంది. చెరుకు బండ్లు, చికెన్ పకోడీ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలు రోడ్డుపైనే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలకు వెళ్లే చిన్నారులు వాహనాల మధ్య రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆక్రమణ ప్రాంతాల్లో విద్యుత్ మీటర్లు ఎలా వచ్చాయి?
ప్రభుత్వ రహదారిని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రాంతాలకు విద్యుత్ మీటర్లు ఏ నిబంధనల ప్రకారం మంజూరు చేశారనే ప్రశ్నలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రహదారి ఆక్రమణకు సంబంధించిన అంశాలను పరిశీలించకుండా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారా? విద్యుత్ మీటర్ల మంజూరుకు ఎవరి అనుమతి ఉంది? సంబంధిత అధికారులు స్థల పరిస్థితులను పరిశీలించారా? అనే ప్రశ్నలకు ఎలక్ట్రికల్ శాఖ అధికారులు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, స్కూల్ రోడ్డుపై ఆక్రమణలను తొలగించి విద్యార్థులు, ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ప్రమాదం జరిగిన తర్వాతే మేల్కొంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.