సేవా స్ఫూర్తితో అంగన్‌వాడీల బలోపేతం చిన్నారులు, తల్లుల సంక్షేమమే బిజెపి లక్ష్యం
కాశినాయన:సెప్టెంబర్ 26ప్రజావాణి గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, మహిళలు, గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీ అవదూత కాశినాయన మండలం గంగనపల్లె గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ‘సేవ సంకల్ప అభియాన్ – అంగన్‌వాడీ ఉత్సవం’ అత్యంత వైభవంగా నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు, సేవ సంకల్ప అభియాన్ అంగన్‌వాడీ ఉత్సవాల బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినకార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఐసీడీఎస్ కాశినాయన మండల సూపర్వైజర్ చంద్రకళ అధ్యక్షతన, బీజేవైఎం రాష్ట్ర నాయకులు, సేవ సంకల్ప అభియాన్ అంగన్‌వాడీ ఉత్సవాల బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ బుసిరెడ్డి మనోహర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పోషకాహార పథకాలను క్షేత్రస్థాయిలోకి విజయవంతంగా తీసుకెళ్లడంలో అంగన్‌వాడీల పాత్రను వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు , దేశ ప్రగతి చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలపైనే ఆధారపడి ఉంటుందని, దానికి అంగన్‌వాడీ కేంద్రాలే మూలస్తంభాలని పేర్కొన్నారు. గంగనపల్లె గ్రామీణ ప్రాంతంలో చిన్నారులలో పోషకాహార లోపాన్ని నివారించడానికి, వారికి ప్రాథమిక అక్షరాస్యతను అందించడానికి టీచర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అంగన్‌వాడీల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అనంతరం బిజేపీ కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు బుసిరెడ్డి ప్రశాంతి,ఎదురు భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సంపూర్ణ పోషణ వంటి పథకాలను సక్రమంగా అందించడంలో సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. చిన్నారుల బరువు, ఎత్తు వంటి ఎదుగుదల పారామితులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది పడుతోందని వివరించారు.
విజయవంతం చేసిన ఐసీడీఎస్ బృందం:గంగనపల్లెలో అంగన్వాడి ఉత్సవాలు విజయవంతం కావడంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, చంద్రకళ, హరిప్రియ, అంగన్వాడి టీచర్లు కీలక పాత్ర పోషించారు. కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై వారు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు.సాధారణంగా విధుల ఒత్తిడిలో ఉండే తమను గుర్తించిన బిజెపి నాయకులు సన్మానించడం పట్ల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని వారు పేర్కొన్నారు. గంగనపల్లె గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవాల పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎదురు నాగార్జున రెడ్డి, బిజెపి మండల ఉపాధ్యక్షుడు సురేష్ నాయుడు, ప్రతాప్ రెడ్డి,అభిలాష్,ప్రసాద్ , బాలింతలు, గర్భిణీలు పలువురు అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.