సెయింట్ థామస్ అల్టిట్యూడ్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన ధర్మం, సత్యం, ప్రేమ, మానవతా విలువలను విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా వారిలో నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మర్రి అశోక్, వైస్ ప్రిన్సిపల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, మమత, కవిత, స్వప్న, గీత, కావ్య, కళ్యాణి, కృష్ణ, ఆశా బేగం, సురేష్, లలిత, సుమలత, రమేష్, రమ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంతో కృష్ణాష్టమి వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.