prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 12:56 pm Digital Edition : MAHESH MEDCHAL

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి

*సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి*

మేడ్చల్ సెప్టెంబర్‌ 16 (ప్రజా వాణి):- తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ మేడ్చల్‌ జిల్లా నాయకులు కిస్టాపూర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్టాపూర్‌లో ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ భారీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్‌ పటేల్‌ దేశ సమైక్యత కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ డివిజన్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ఆ రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్‌ 17 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని, స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకోవాలని వారు కోరారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నాయకత్వంలో దేశ సమైక్యత కోసం జరిగిన కృషిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కార్యక్రమంలో గౌరరం జగన్ గౌడ్ బిజేపీ మేడ్చల్‌ జిల్లా నాయకులు, అర్జున్, గౌలికర్ మహేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సర్దార్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు.