prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:58 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయండి.కరువు నివారణ చర్యలు చేపట్టండి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు డిమాండ్.

కడప సెప్టెంబర్ 13 ప్రజావాణి ఎన్నికల ముందుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు.ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.శివకుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రజల ఓట్లు పొంది, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా కూడ ఇంతవరకు కొన్ని హామీలను అమలుపరచలేదని అన్నారు.ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు1500 రూపాయలు,నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు, సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలుపరచకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేవలం పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అని ప్రచారం చేసుకోవడం దారుణం అన్నారు. ఒకవైపు ఉచిత బస్సు సౌకర్యం అంటూ మరోవైపు ఉన్న బస్సులను సగానికి తగ్గించి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న ప్రభుత్వం వాటి జాడేలేదని తెలిపారు. తల్లికి వందనం, రైతులకు రైతు భరోసా నిధులు తొలి సంవత్సరం ఇవ్వలేదన్నారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించి రెండున్నర సంవత్సరాలు దాటుతున్న కూడా ఇప్పటికీ ఎక్కడా ఇవ్వలేదని లేదని ఆరోపించారు. ఇటీవల సామాజిక శంఖారావం పేరుతో చేసిన అధ్యయనంలో దళిత గిరిజనులు నేటికీ సామాజిక వివక్షతకు, ఆర్థిక రాజకీయ వివక్షతలకు గురవుతున్నారని తేలిందన్నారు. వారు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవని, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. మరోవైపు పాలకులు నిత్యవసర ధరలను అరికట్టటంలో విఫలమయ్యారని అన్నారు. బియ్యం చక్కెర వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిత్యవసర సరుకులు అన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఎన్నికల నాడు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఏ పంటలు వెయ్యాలో అర్థం కాని స్థితిలో రైతులు ఆందోళన పడుతుండగా, పనులు లేకుండా గ్రామాల్లో ఎట్లా బ్రతకాలి, ఎక్కడికి వలస పోవాలి అనే ఆందోళనలో వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా కడప జిల్లా మారుతున్నదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రతి పేద కుటుంబానికి కరువు బత్యం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని, నిత్యవసర సరుకులు ఉచితంగా అందించాలని, ఉపాధి హామీ పనులు విస్తృతంగా చేపట్టాలని, కనీస వేతనం 600 పెంచాలని డిమాండ్ చేశారు. పశు పోషకులకు ఉచితంగా గ్రాసం అందించాలని మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ఈనెల 21, 22 తేదీలలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తెలిపారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం డేవిడ్, సరస్వతమ్మ, స్వప్న, జిల్లా నాయకులు కోనేటి నరసయ్య, ఎన్ వీరయ్య, పి సురేష్ బాబు, ఎస్ గురవయ్య, లాజరస్, బాబు, కిరణ్ , ఇ. రమణ ఎస్ భాషా సాంబశివుడు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.