*సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా*
*ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా… భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ఆదేశాలు*
*మన ప్రజావాణి*
మంచిర్యాల సెప్టెంబర్ 28
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలోని రహదారి పరిస్థితులు,డివైడర్ తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైన సంఘటన అన్నారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన మేరకు ఆటో రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ, ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం అత్యంత విషాదకరమని, మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. వారు తమ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉందన్నారు. ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు.
రహదారి మధ్యలోని డివైడర్‌లో ఉన్న ఖాళీ ద్వారా వాహనాలు అక్రమంగా మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు.ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
రహదారిపై అవసరమైన నిర్మాణాత్మక మార్పులు చేయడం, డివైడర్‌లోని ఖాళీని మూసివేయడం, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపించి,వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొంతమందిని ఇప్పటికే కరీంనగర్‌కు తరలించామని, మరికొందరు మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు.బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా స్థానిక కలెక్టర్‌తో కూడా మాట్లాడి సమన్వయం చేస్తున్నామని సీపీ తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, అవసరమైన ఇంజినీరింగ్ చర్యలు,ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు..