*సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం*
రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 19 (ప్రజావాణి): సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని, పేదలు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన ఐతరాజు ముత్యాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ విషయాన్ని డీసీసీ అధికార ప్రతినిధి బైరిక రమాకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించారు.
దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం ఐతరాజు ముత్యాలకు రూ.38 వేల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. మంజూరైన చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తన నివాసంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు.
ఈ సందర్భంగా కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన పేదలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్‌లోతు శ్రీనివాస్ నాయక్, మార సురేష్, చేతళ్ల సతీష్, ఓరుగంటి లింగంగౌడ్, ముత్యాల ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.