prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 11:40 am Digital Edition : PRAJA VANI

సీఎం ప్రోగ్రామ్‌కు ఉద్యోగుల డ్యూటీలా..?

సీఎం ప్రోగ్రామ్‌కు ఉద్యోగుల డ్యూటీలా..?

35 గ్రామాలకు బస్సుల ఇంచార్జి.. అసిస్టెంట్ల నియామకం!

జనసమీకరణ బాధ్యతలు సిబ్బందికేనా..? బయటకొచ్చిన లేఖతో కలకలం

లేఖ ఎలా బయటకు వెళ్లిందంటూ ఎంపీడీవో ఆగ్రహం.. కార్యదర్శులపై ఆరా

మన్నె క్రిశాంక్ ట్వీట్‌తో రాష్ట్రస్థాయిలో హాట్‌టాపిక్

ఇల్లంతకుంట, ప్రజావాణి

సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మండలంలోని 35 గ్రామాలకు బస్సుల ఇంచార్జి, అసిస్టెంట్ డ్యూటీలు కేటాయించినట్లు పేర్కొంటున్న లేఖ బయటకు రావడంతో వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్స్, ఎంపీడబ్ల్యూ‌లకు బస్సుల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. గ్రామాల నుంచి ప్రజలను సమీకరించి సిరిసిల్లలో జరిగే సీఎం కార్యక్రమానికి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ డ్యూటీలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

మా డ్యూటీ ఇదేనా..?

బస్సుల నిర్వహణ, జనసమీకరణ బాధ్యతలను ప్రభుత్వ సిబ్బందికి అప్పగించడంపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. “ప్రభుత్వ విధులు నిర్వహించాలా.. జనసమీకరణ బాధ్యతలు చేపట్టాలా..?” అంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు డ్యూటీల కేటాయింపులోనూ అసమానతలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే బాధ్యతలు అప్పగించారని, మరికొందరికి విధులు ఇవ్వలేదని పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

లేఖ లీక్‌పై గుర్రు..?

బస్సుల డ్యూటీలకు సంబంధించిన సదరు లేఖ బయటకు రావడం ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. లేఖ ఎలా బయటకు వెళ్లిందన్న అంశంపై ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహంగా ఉన్నట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది.అధికారిక లేఖ సోషల్ మీడియాలోకి ఎలా చేరింది? ఎవరి ద్వారా బయటకు వెళ్లింది? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

కలెక్టర్.. జెడ్పీ సీఈవో దృష్టికి..?

ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌తో పాటు జెడ్పీ సీఈవో కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై అధికారుల నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

ఇల్లంతకుంటలోనే ఎందుకు..?

సీఎం కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలోని ఇతర మండలాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అనే చర్చ మొదలైంది. కేవలం ఇల్లంతకుంట మండలంలోని 35 గ్రామాలకు ప్రత్యేకంగా బస్సుల ఇంచార్జి, అసిస్టెంట్ డ్యూటీలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుండటంపై స్థానికంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ డ్యూటీల కేటాయింపునకు ప్రాతిపదిక ఏమిటి? జనసమీకరణ బాధ్యతలను ప్రభుత్వ సిబ్బందికి అప్పగించడంపై ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

క్రిశాంక్ ట్వీట్‌తో రాష్ట్రంలో చర్చ

ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్ చేసిన ట్వీట్ సంచలన చర్చకు దారితీసింది. ట్వీట్ అనంతరం సిరిసిల్ల జిల్లా రాజకీయ వర్గాలతో పాటు ఇల్లంతకుంట మండలంలోనూ ఈ అంశంపై వేడి పెరిగింది.సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బందిని జనసమీకరణ కోసం వినియోగిస్తున్నారనే ప్రచారంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మండలంలో మొదలై.. రాష్ట్రానికి చేరిన చర్చ!

35 గ్రామాలు.. బస్సుల డ్యూటీలు.. బయటకొచ్చిన లేఖ.. లేఖ లీక్‌పై అధికారుల ఆరా.. కలెక్టర్, జెడ్పీ సీఈవో దృష్టి.. క్రిశాంక్ ట్వీట్.. ప్రతిపక్షాల విమర్శలు..ఇలా ఇల్లంతకుంట మండలంలో మొదలైన ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం కార్యక్రమానికి సంబంధించి ఉద్యోగులకు కేటాయించిన డ్యూటీలపై అధికారికంగా ఎలాంటి వివరణ వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

ఎంపీడీవోపై బీఆర్ఎస్ నేత విమర్శలు

ఉద్యోగులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరం

ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్‌లకు జన సమీకరణ చేయించడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన ఎంపీడీవో.. ఉద్యోగులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎంపీడీవో తీరుపై విమర్శలు చేసిన నర్సింహారెడ్డి.. అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఎంపీడీవోపై తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

– పల్లె నర్సింహారెడ్డి,
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఇల్లంతకుంట