prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:05 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తక్షణమే తొలగించాలి: డివైఎఫ్ఐ  డిమాండ్

పోరుమామిళ్ల సెప్టెంబర్ 29ప్రజావాణి మండల కమిటీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది.భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య  పోరుమామిళ్ల మండల కమిటీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది మంగళవారం ఉదయం డివైఎఫ్ఐ మండల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పోరుమామిళ్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రత్నమయ్య, ఎం. సుందరయ్యలు మాట్లాడుతూ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్య విలువులకు విరుద్ధంగా, కేంద్ర పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్‌గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలో ప్రజాస్వామ్య మనుగడకే తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

13 కోట్ల మంది ఓటు హక్కు ప్రమాదంలో!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సుమారు 13 కోట్ల మంది భారత పౌరుల ఓటు హక్కును ప్రమాదంలో పడేశాయని డివైఎఫ్ఐ నాయకులు ధ్వజమెత్తారు. కొత్త ఓటర్ల నమోదు విధానంలో తీసుకొచ్చిన అడ్డగోలు మార్పులు, ఓటర్ల జాబితా భద్రత వంటి కీలక విషయాలపై జ్ఞానేశ్ కుమార్ కమిషన్‌లోని ఇతర సభ్యుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, మెజార్టీ నిర్ణయానికి భిన్నంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

కమిషనర్ల అభ్యంతరాల బేఖాతరు – ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదులు

గత పది నెలల కాలంలోనే వివిధ కీలక అంశాలపై తోటి కమిషనర్లు సందు, జోషిలు కనీసం 14 సార్లు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ, జ్ఞానేశ్ కుమార్ వారికి తెలియకుండానే అనేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని రత్నమయ్య, సుందరయ్య పేర్కొన్నారు. ఈ నియంతృత్వ పోకడలను మరియు రాజ్యాంగ ఉల్లంఘనలను సహించలేక సదరు ఇద్దరు కమిషనర్లు అత్యున్నత అధికారైన ప్రధాన కార్యదర్శికి విడివిడిగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారంటే, ఎన్నికల సంఘంలో అంతర్గతంగా ప్రమాదం ఏ స్థాయికి చేరిందో స్పష్టమవుతోందని వారు విశ్లేషించారు.

బిజెపి ప్రభుత్వం ముందస్తు రక్షణ చట్టాలు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టే నాటికే ఒక ప్రణాళిక ప్రకారం చట్టసవరణలు చేసిందని నాయకులు ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలను, విధానాలను సమీక్షించడం కానీ, వాటిపై విచారణ జరపడం కానీ, లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడం కానీ చేయరాదనే నిబంధనలను తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా ప్రమాదంలో పడేసే అత్యంత తీవ్రమైన చర్య అని వారు విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ప్రజలు (ఓటర్లు) పాలకులను ఎన్నుకోవడం కాకుండా, పాలకులే తమకు నచ్చిన ఓటర్లను ఎన్నుకునే విధంగా ఎన్నికల సవరణ ప్రక్రియలు సాగుతున్నాయని డివైఎఫ్ఐ ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా గాని వ్యవహరించకూడదని, కానీ ప్రస్తుత సీఈసీ తీరు మాత్రం బిజెపి ఎన్నికల్లో గెలవడానికి కావలసిన అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకే అన్నట్లుగా ఉందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో, రాజ్యాంగబద్ధ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగే ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మరియు ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ పోరుమామిళ్ల మండల నాయకులు గుర్రప్ప, ప్రసాదు, నితీష్, మనీ తదితరులు పాల్గొని తమ మద్దతును పలికారు.