*సామాజిక చైతన్యానికి సత్కారం.. రమేష్ గుప్తాకు ‘సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డు*
మేడ్చల్: సామాజిక సేవకు సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డు తాళ్లపల్లి రమేష్ గుప్తాకు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సమాచార హక్కు చట్టం మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ, సామాన్య ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలందిస్తున్న మేడ్చల్ పట్టణానికి చెందిన తాళ్లపల్లి రమేష్ గుప్తాకు అరుదైన గౌరవం లభించింది. ఆయన అందిస్తున్న సామాజిక సేవలను గుర్తించిన మాక్ష గ్లోబల్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ‘సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డుతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన మాక్ష గ్లోబల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సౌత్ ఇండియా అవార్డ్స్ –2026 సీజన్-5 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని గుర్తించి పురస్కారాలతో సత్కరించారు. అందులో భాగంగా మేడ్చల్ పట్టణానికి చెందిన రమేష్ గుప్తా చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయనకు సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డును ప్రదానం చేశారు.
ప్రజలకు రాజ్యాంగబద్ధంగా అందుబాటులో ఉన్న హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందేందుకు సహకరించడం, ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాల్లో రమేష్ గుప్తా చురుకుగా పాల్గొంటున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
సామాన్య ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి చట్టపరమైన మార్గాలను సూచించడం, సమాజంలో సామాజిక బాధ్యతను పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడం వంటి సేవలను ఆయన కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా తన వంతు సహకారం అందించడం ద్వారా సామాజిక సేవలో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రమేష్ గుప్తా మాట్లాడుతూ తన సేవలను గుర్తించి సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించేందుకు ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం, సమాచార హక్కు, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక చైతన్యం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
రమేష్ గుప్తాకు అవార్డు లభించడంపై మేడ్చల్ పట్టణానికి చెందిన పలువురు ప్రజలు, సామాజిక సేవకులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి అవార్డు అందించడం సమాజ సేవకు దక్కిన గౌరవంగా పలువురు పేర్కొన్నారు.