prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 10:16 am Digital Edition : PRAJA VANI

సర్టిఫికెట్ అడిగితే అధికారిణి దురుసు ప్రవర్తన: బాధితురాలి ఆవేదన

*సర్టిఫికెట్ అడిగితే అధికారిణి దురుసు ప్రవర్తన: బాధితురాలి ఆవేదన*

*ముదిగొండ మండలం మల్లారంలో వివాదం.. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని రమ్య డిమాండ్*
ముదిగొండ సెప్టెంబర్ 22 ప్రజావాణి ప్రతినిధి

ప్రభుత్వ పథకాలు, అవసరాల నిమిత్తం ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామానికి చెందిన వనం రమ్య (భర్త: వనం శేషు) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వల్లభి–మల్లారం పరిధిలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ విభాగ అధికారిణి (జి పి ఓ) తనతో అనుచితంగా మాట్లాడటమే కాకుండా కార్డులు రద్దు చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు.

*బాధితురాలి వివరాల ప్రకారం:*

రమ్య కుటుంబ కలహాలు, ప్రాణహాని కారణంగా భర్త నుంచి తాత్కాలికంగా దూరంగా ఉంటున్నారు. అయితే కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తాము విడాకులు తీసుకోలేదని, తమ ఆధార్ మరియు రేషన్ కార్డులు ఇప్పటికీ మల్లారం గ్రామం చిరునామా పైనే కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. ప్రతి నెలా రేషన్ కూడా అక్కడే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదాయ/సంబంధిత ధ్రువీకరణ పత్రం కోసం మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోగా, దానిని పరిశీలించి ఆమోదించాల్సిన జీపీఓ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని రమ్య పేర్కొన్నారు.

“నువ్వు గ్రామంలో ఉండటం లేదు, నీకు సర్టిఫికెట్ ఇచ్చేది లేదు” అంటూ వాగ్వాదానికి దిగారని, నిబంధనలను వివరించాల్సింది పోయి ఆధార్, రేషన్ కార్డులను కూడా తొలగిస్తామంటూ బెదిరింపు ధోరణితో, దురుసుగా మాట్లాడారని బాధితురాలు ఆరోపించారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళ పట్ల సానుభూతి లేకుండా, ఒక ప్రజాసేవకురాలి హోదాలో ఉండి అమర్యాదగా వ్యవహరించడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.

*ఉన్నతాధికారులు స్పందించాలి:*

సమస్యల సుడిగుండంలో ఉన్న పేద మహిళల పట్ల ఇలాంటి ధోరణి సరైంది కాదని, బాధితురాలి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధంగా రావాల్సిన సర్టిఫికెట్‌ను మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించిన సదరు అధికారిణిపై జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వనం రమ్య విజ్ఞప్తి చేశారు.