సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
• కాలినడకన, ఆటోలో తిరుగుతూ ఊరేగింపులను పర్యవేక్షించిన జగ్గారెడ్డి
• సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిమజ్జన వేడుకల పర్యవేక్షణ
• రూ.21 లక్షలకు చైతన్య యువజన సంఘం లడ్డూను దక్కించుకున్న జగ్గారెడ్డి
సంగారెడ్డి, సెప్టెంబర్ 27: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సంగారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వినాయక విగ్రహాల ఊరేగింపులను జగ్గారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
ఊరేగింపు మార్గాల్లో కాలినడకన, ఆటోలో తిరుగుతూ పరిస్థితులను పరిశీలించిన జగ్గారెడ్డి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పోలీసు, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించారు.
నిమజ్జనోత్సవాల్లో జగ్గారెడ్డి తన భార్య నిర్మల, కుమార్తె జయ చైతన్య రెడ్డి, కుమారుడు భరత్ సాయి రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భక్తులతో మమేకమై ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమాలను శనివారం తెల్లవారుజామున 6 గంటల వరకు కింది బజార్ చెరువు వద్ద జగ్గారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వినాయక విగ్రహాలు వరుసగా నిమజ్జనం అయ్యేలా అధికారులు, నిర్వాహకులతో సమన్వయం చేశారు.
రూ.21 లక్షలకు లడ్డూ వేలం
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన చైతన్య యువజన సంఘం నిర్వహించిన లడ్డూ వేలంలో జగ్గారెడ్డి పాల్గొని రూ.21 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున ఈ లడ్డూను వేలంలో పొందినట్లు ఆయన తెలిపారు.
నిమజ్జన వేడుకల్లో ప్రముఖ గాయకుడు జంగి రెడ్డి ఆలపించిన భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండ్ ట్రూప్స్ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో భక్తుల సందడి నెలకొనగా, ఉత్సవ వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి.