*షాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలి*
* *షాబాద్ లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు చేవెళ్లే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు పూర్వ విద్యార్థుల వినతి*
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 ప్రజావాణి
షాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు, షాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పూర్వ విద్యార్థులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. షాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, అనేక మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, భవనాల పునరుద్ధరణ, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు నిధులు అవసరమని పేర్కొన్నారు.
అలాగే షాబాద్ మండలంలోని విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు, జూనియర్ కళాశాల మంజూరుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్యను కోరారు.
పూర్వ విద్యార్థుల వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంబంధిత అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత మేరకు చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు కుమ్మరి యాదగిరి, బాలరాజు, శ్రీనివాసచారీ, సత్యం నాయి, హరీకుమార్, రాంచెంద్రయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.