ఘట్కేసర్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ మార్కెట్‌లో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ సభ్యులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, భక్తులు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
