prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 7:02 am Digital Edition : PRAJA VANI

వెయ్యి రోజుల ప్రజా పాలనకు ప్రజల మద్దతు<br>

వెయ్యి రోజుల ప్రజా పాలనకు ప్రజల మద్దతు

నరసింహులపేటలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ ర్యాలీ

నరసింహులపేట, సెప్టెంబర్ 6 (ప్రజావాణి):
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నరసింహులపేట మండల కేంద్రంలో వెయ్యి రోజుల ప్రజా పాలన దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ప్రజల ఆశీస్సులతో డోర్నకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు జీనకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజ్ రాజశేఖర్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు దస్రు నాయక్, ఆలయ చైర్మన్ వేముల విజయపాల్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.