prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 10:19 am Digital Edition : PRAJA VANI

వెట్టిచాకిరీ విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం

వెట్టిచాకిరీ విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం

* మతపోరాటంగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే

* సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొత్త నరసింహులు

భిక్కనూర్‌, సెప్టెంబర్ 17 ( ప్రజావాణి ):

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ–ముస్లింల మధ్య జరిగిన మతపోరాటం కాదని, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన ప్రజా పోరాటమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొత్త నరసింహులు అన్నారు. భి క్కనూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు.

నిజాం పాలనలో రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములతో పాటు వారితో చేతులు కలిపిన కొందరు దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం సాగించారని నరసింహులు పేర్కొన్నారు. పేద రైతుల భూములను ఆక్రమించుకోవడం, ప్రజలతో వెట్టిచాకిరీ చేయించడం, ఎదిరించిన వారిపై అణచివేతకు పాల్పడటం వంటి పరిస్థితులకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించిందన్నారు.

ఈ పోరాటంలో దొడ్డి కొమురయ్యతో పాటు షేక్‌ బందగి వంటి ముస్లిం యువకులు కూడా అమరులయ్యారని గుర్తుచేశారు. హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా ప్రజలు ఐక్యంగా సాగించిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమమని వివరించారు.

వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, ప్రజలు ప్రాణత్యాగాలు చేసి దొరల దౌర్జన్యాలను ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. రైతాంగ పోరాటం ద్వారా అనేక ప్రాంతాల్లో భూస్వామ్య ఆధిపత్యానికి సవాల్‌ విసిరి, పేదలకు భూముల పంపిణీ, గ్రామస్థాయి ప్రజా పాలన కోసం ఉద్యమం సాగిందన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చారిత్రక సంఘటనలకు మతపరమైన రంగు పులమడం సరికాదని నరసింహులు అన్నారు. చరిత్రను వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేయాలని యువతకు సూచించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వివిధ వర్గాల ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ పోరాట స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆర్‌. లింగం, ఆర్‌. స్వామి, వి. లింగం, ఇ. భూమేష్‌, వెంకటేష్‌, బి. చందు, వి. సురేష్‌, ఎ. ఆంజనేయులు, నరేష్‌, జి. నాగులు తదితరులు పాల్గొన్నారు.