వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కౌన్సిలర్లు
ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని మల్కా చెరువులో వినాయక నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను కౌన్సిలర్లు ముత్యాల గౌడ్, ఆరిఫ్, విఘ్నేశ్వర్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు, మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేసినట్లు తెలిపారు.
రాత్రి వేళల్లో కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా చెరువు పరిసరాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు. నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఈత రాని వారు చెరువు వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సూచనలు, ఆదేశాలను మండప నిర్వాహకులు తప్పనిసరిగా పాటిస్తూ వారికి సహకరించాలని కోరారు.
వినాయక నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మొదట భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని కౌన్సిలర్లు పేర్కొన్నారు. భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వారు కోరారు.