*వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు!
*సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్..
*భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు
పటాన్‌చెరు, సెప్టెంబర్ 24 (ప్రజావాణి): వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టింది. శుక్రవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ ఎం. రమేష్ డిసి జ్యోతి రెడ్డితో కలిసి గురువారం పటాన్‌చెరులోని సాకి చెరువును పరిశీలించారు. శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు, మున్సిపల్, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సీపీ వెల్లడించారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.