వినాయక నిమజ్జనం వేళ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ అధ్యక్షులు జాకట శ్రీనివాస్
మేడ్చల్, సెప్టెంబర్ 18: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ అధ్యక్షులు జాకట శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి నుంచి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాల సమయంలో చెరువులు, కుంటలు, బావులు, ఇతర నీటి వనరుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆరుగురు విద్యార్థులు చెరువులో పడి మృతి చెందిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా పిల్లలను నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా చూడాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాలకు పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలు, లోతైన నీటి ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాకట శ్రీనివాస్ సూచించారు. భక్తి, ఉత్సాహంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌పీ పార్టీ రాష్ట్ర నాయకులు, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.