వినాయకుడి లడ్డూ రూ.1.35 లక్షలకు కైవసం
దేవరయాంజాల్‌లో భక్తిశ్రద్ధలతో గణేశ నవరాత్రి ఉత్సవాలు
లడ్డూ వేలంలో పాల్గొని దక్కించుకున్న తూంకుంట జగదీశ్ గౌడ్
శామీర్‌పేట్: గణేశ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో తూంకుంట జగదీశ్ గౌడ్ రూ.1,35,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
వినాయక విగ్రహాన్ని కట్ట శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దాతలుగా అందించగా, అన్నప్రసాద కార్యక్రమాన్ని మోటే బాలయ్య, గంధం ప్రవీణ్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో జగదీశ్ గౌడ్ లడ్డూను దక్కించుకోగా, అనంతరం అతిథులు ఆయనకు లడ్డూను అందజేశారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఇ. శ్రీనివాస్, డివిజన్ బీజేపీ నాయకులు పి. నర్సింహారెడ్డి, స్థానికులు ఎం. బాలయ్య, పి. సుధాకర్ రెడ్డి, ఎన్. శంకర్ రెడ్డి, వి. రాజిరెడ్డి, జి. ప్రవీణ్ గౌడ్, ఎం. లక్ష్మణ్, ఎం. శేఖర్ గౌడ్, ఎం. రమేష్, ఎం. హుసేన్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయక విగ్రహ దాత కట్ట శ్రీకాంత్ రెడ్డి, అన్నప్రసాద దాతలు మోటే బాలయ్య, గంధం ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాతలను ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించి, గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.