prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:10 pm Digital Edition : PRAJA VANI

విఘ్నేశ్వరుని సన్నిధిలో భక్తి వైభవం

విఘ్నేశ్వరుని సన్నిధిలో భక్తి వైభవం

75 రకాల నైవేద్యాలతో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో విశేష పూజలు

పోత్కపల్లి, సెప్టెంబర్ 21:
పోత్కపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోత్కపల్లి ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామివారికి గణపతి పూజ, కుంకుమ పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివారికి 75 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిభావాన్ని చాటుకున్నారు.

ఉదయం నుంచే ముదిరాజ్ యూత్ సభ్యులు, భక్తులు పూజా కార్యక్రమాలకు హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తి గీతాల మధ్య గణపతి పూజ, కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో సాగాయి. అనంతరం వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, సంప్రదాయ వంటకాలతో కలిపి 75 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు.

విఘ్నేశ్వరుని కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సభ్యులు ఆకాంక్షించారు.
అనంతరం పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. యువత ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
భక్తి, ఐక్యత, సంప్రదాయాలకు ప్రతీకగా ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమం పోత్కపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.