prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:32 am Digital Edition : PRAJA VANI

వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.. ఇందిరమ్మ ఇల్లు కోసం వేడుకోలు!

వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.. ఇందిరమ్మ ఇల్లు కోసం వేడుకోలు!

నిరాశ్రయులైన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని బాధితుడి విజ్ఞప్తి

తంగళ్లపల్లి, సెప్టెంబర్‌ 19, ప్రజావాణి: ఇటీవల కురిసిన వర్షాలకు తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామంలో ఓ పేద కుటుంబం ఇల్లు కుప్పకూలింది. గ్రామానికి చెందిన నకీర్తి బాలయ్యకు చెందిన ఇల్లు శనివారం వేకువజామున ఒక్కసారిగా కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఎవరూ గాయపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబం తలదాచుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇల్లు కూలిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధిత కుటుంబ యజమాని నకీర్తి బాలయ్య విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో ఇల్లు కూలిపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వం స్పందించి అర్హతను పరిశీలించి వెంటనే గృహ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ కంకణాల రజిత రమేష్‌, వార్డు సభ్యుడు గట్టు రాజిరెడ్డి కూలిపోయిన ఇంటిని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.