వరి పంటలో కంకి నల్లి, సుడి దోమ నివారణకు చర్య సరైన సమయంలో పురుగుమందుల పిచికారీతో అధిక దిగుబడులు సాధించవచ్చు
రైతులకు వ్యవసాయ నిపుణుల సూచనలు
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 27, ప్రజావాణి: వరి సాగులో కంకి నల్లి (పానికిల్ మైట్), సుడి దోమ (బ్రౌన్ ప్లాంట్ హాపర్) ఆశించి పంట దిగుబడిని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పురుగుల నివారణకు రైతులు సరైన సమయంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని పేర్కొన్నారు. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పురుగుల ఉధృతిని గుర్తించి, అవసరమైన మేరకు పురుగుమందులను వినియోగించాలని సూచించారు.వరిలో కంకి నల్లి ఆశించడం వల్ల గింజలు నల్లబడి, పొల్లుగా మారడంతో పాటు గింజలు గిలుక లేదా చిలుక ముక్కు ఆకారంలోకి మారే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. దీని నివారణకు స్పైరోమెసిఫెన్ 22.9 శాతం ఎస్‌సీ మందును ఎకరాకు 100 మిల్లీలీటర్ల చొప్పున, ప్రొపికోనజోల్ 25 శాతం ఈసీ మందును ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున వినియోగించాలని సూచించారు. అయితే, ఈ రెండు మందులను కలిపి పిచికారీ చేసే ముందు వాటి అనుకూలత, పంట దశ, ఉత్పత్తి లేబుల్‌పై ఉన్న సూచనలను పరిశీలించాలని తెలిపారు. కంకి నల్లి నివారణకు సాయంత్రం వేళల్లోనే పిచికారీ చేయాలని, ఉదయం పూట మంచు ఉన్న సమయంలో మందులు వాడకూడదని సూచించారు.సుడి దోమ వరి మొక్కల మొదళ్లలో చేరి రసం పీల్చడం వల్ల పైరు సుడిబడి ఎండిపోతుందని, దీనిని హాపర్ బర్న్ అంటారని నిపుణులు వివరించారు. దీని నివారణకు ట్రైఫ్లుమెజోపైరిమ్ 10 శాతం ఎస్‌సీ మందును ఎకరాకు 94 మిల్లీలీటర్లు లేదా పైమెట్రోజైన్ 50 శాతం డబ్ల్యూజీ మందును ఎకరాకు 120 గ్రాముల చొప్పున వినియోగించాలని సూచించారు.పురుగుమందుల పిచికారీ సమయంలో ద్రావణం వరి మొక్కల మొదళ్లకు, కాండం భాగానికి చేరేలా చూడాలని తెలిపారు. సుడి దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలోని నీటిని బయటకు తీసి మూడు నుంచి నాలుగు రోజులపాటు ఆరబెట్టాలని సూచించారు. నత్రజని ఎరువులైన యూరియాను పరిమితికి మించి వినియోగించవద్దని, అధిక మోతాదులో ఎరువులు వేయడం వల్ల సుడి దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిచ్చరు. పురుగుమందులను వ్యవసాయ శాఖ అధికారులు లేదా నిపుణుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. మందుల లేబుల్‌పై పేర్కొన్న పంట, పురుగు, మోతాదు, పిచికారీ విధానం, కోతకు ముందు వేచి ఉండాల్సిన వ్యవధిని తప్పనిసరిగా పాటించాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించి పిచికారీ చేయాలని, గాలి దిశకు వ్యతిరేకంగా మందులు పిచికారీ చేయకూడదని సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకొని, ఆశించిన దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు.