prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:17 pm Digital Edition : PRAJA VANI

వరంగల్ విమానాశ్రయానికి “దొడ్డి కొమురయ్య విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

*వరంగల్ విమానాశ్రయానికి “దొడ్డి కొమురయ్య విమానాశ్రయం”గా నామకరణం చేయాలి*

*GMPS రాష్ట్ర కమిటీ డిమాండ్*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
వరంగల్ మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (GMPS) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

వరంగల్ విమానాశ్రయానికి పేరు సూచించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రజలను కోరిన నేపథ్యంలో, దొడ్డి కొమురయ్య పేరును పరిశీలించాలని GMPS రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తయి, భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ చరిత్రలో చిరస్మరణీయమైన పేరు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచారు. ఆయన అమరత్వం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచింది.

వరంగల్ ప్రాంతానికి చెందిన ఒక చారిత్రక వ్యక్తి పేరును విమానాశ్రయానికి పెట్టడం ద్వారా తెలంగాణ చరిత్ర, రైతాంగ పోరాట వారసత్వం, సామాజిక న్యాయ విలువలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి, ఆ ఉద్యమానికి నాటి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ఉపయోగపడిందని అన్ని పార్టీల నేతలు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారన్నారు.

ప్రభుత్వం గతంలో కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి ఐలమ్మ పేరు పెట్టడం, ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి, దొరతనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపిన చైతన్యవంతమైన నేల అని, అలాంటి నేలకు మళ్లీ రాచరికపు రాజులు, రాణుల పేర్లు పెట్టాలని చర్చ చేయడం సరికాదన్నారు.

విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన మౌలిక వసతి మాత్రమే కాకుండా, వరంగల్ చారిత్రక సామాజిక గుర్తింపును ప్రపంచానికి పరిచయం చేసే ఒక ముఖ్యమైన వేదికగా మారనున్నందున, దానికి పేరు పెట్టే విషయంలో తెలంగాణ ఉద్యమ, రైతాంగ, సామాజిక చరిత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, దొడ్డి కొమురయ్య పేరును అంతిమ నిర్ణయంగా తీసుకోవాలని కమిటీ కోరింది.