*రోడ్డుపై మార్కెట్‌కు చెక్.. వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం!
*ట్రాఫిక్ ఇబ్బందులకు పరిష్కారం..
* సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేస్-2 ఎదురుగా ప్రభుత్వ స్థలం పరిశీలించిన మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
అమీన్‌పూర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి):అమీన్‌పూర్ ప్రధాన రహదారిపై గురువారం, ఆదివారం నిర్వహించే వారపు సంతతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మార్కెట్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం లభించింది. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయవద్దని జీహెచ్‌ఎంసీ సిబ్బంది హెచ్చరించడంతో ఆందోళనకు గురైన చిరు వ్యాపారులు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిని ఆశ్రయించారు.
వ్యాపారుల సమస్యలను తెలుసుకున్న ఆయన.. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, అదే సమయంలో చిరు వ్యాపారుల జీవనోపాధికి భంగం కలగకుండా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన రహదారులపై మార్కెట్లు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించే పరిస్థితులను నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
సాయిరామ్ ఎన్‌క్లేవ్ వద్ద స్థల పరిశీలన
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో అమీన్‌పూర్ నుంచి నవ్య చౌరస్తాకు వెళ్లే మార్గంలోని సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేస్-2 ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తుమ్మల పాండురంగారెడ్డి స్వయంగా పరిశీలించారు. వారపు మార్కెట్ నిర్వహణకు అనుకూలంగా ఆ స్థలాన్ని కేటాయించేలా చర్యలు చేపట్టారు. వెంటనే జేసీబీలతో స్థలాన్ని చదును చేయించి, వ్యాపారులకు, వినియోగదారులకు అనుకూలంగా విద్యుత్ లైట్ల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మాజీ చైర్మన్‌కు వ్యాపారుల కృతజ్ఞతలు
ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారులు మాట్లాడుతూ.. గత రెండు, మూడు వారాలుగా రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఆంక్షలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. జీవనోపాధి కోల్పోయే పరిస్థితుల్లో తుమ్మల పాండురంగారెడ్డిని ఆశ్రయించగా, తమ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంతో పాటు జేసీబీతో స్థలాన్ని చదును చేసి, లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం తమకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. తమ జీవనోపాధికి అండగా నిలిచిన మాజీ చైర్మన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, ఉపేందర్‌రెడ్డి, దశరథ్, స్థానిక నాయకులు, మార్కెట్ వ్యాపార సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.