రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఇవ్వాలి
కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు-సీపీఎం
బెజ్జంకి,సెప్టెంబర్ 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో రైతులకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ అన్నారు.సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,బెజ్జంకి మండలంలో రైతులకు 7, 8 గంటలు కూడా త్రీఫేస్ విద్యుత్ అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన మేర విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యుత్ అధికారులు కూడా నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికే సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు పంటలకు తెగుళ్లు సోకడంతోపురుగుమందులు, ఇతర పెట్టుబడులు పెరిగాయని అన్నారు. యూరియా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ఇంత పెట్టుబడి పెట్టి పంటలను కాపాడుకునే సమయంలో విద్యుత్ కోతలు మరింత సమస్యగా మారాయని తెలిపారు.వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు నాణ్యమైన 24 గంటల త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని సీపీఎం తరఫున డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బొమ్మిడి సాయికృష్ణ, భోనగిరి లింగం, సంఘ ఎల్లయ్య, బోనగిరి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.