రేపు చక్రస్నానం.. పుష్కరిణి వద్ద పటిష్ట భద్రత
తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన చక్రస్నానం బుధవారం ఉదయం జరగనున్న నేపథ్యంలో పుష్కరిణి వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆధ్వర్యంలో టీటీడీ సీవీ అండ్ ఎస్‌వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్‌తో కలిసి మంగళవారం తిరుమల శ్రీ పుష్కరిణి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పోలీసులు, టీటీడీ విజిలెన్స్, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి పుష్కరిణి పరిసరాలు, భక్తుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, రద్దీ నియంత్రణ ప్రాంతాలు, బందోబస్తు పాయింట్లను ఎస్పీ పరిశీలించారు. భక్తుల రాకపోకలు క్రమబద్ధంగా, సురక్షితంగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
చక్రస్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, ఇన్–ఎగ్జిట్ మార్గాల నిర్వహణ, పుష్కరిణి వద్ద నిరంతర పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పోలీసు, టీటీడీ విజిలెన్స్, ఇతర విభాగాలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
పుష్కరిణిలో స్నానం చేసే భక్తులు పోలీసు, టీటీడీ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణయించిన మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని అధికారులు సూచించారు. రద్దీ సమయంలో తొందరపడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
అదేవిధంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టవద్దని సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యం, క్రమబద్ధమైన రాకపోకలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఇతర విభాగాలు సమన్వయంతో విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
