prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 1:36 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్రాన్ని నడపలేక, హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం

రాష్ట్రాన్ని నడపలేక, హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి : శ్రవణ్,మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్,

కాప్రా ప్రతినిధి సెప్టెంబర్ 29 (ప్రజావాణి ప్రతినిధి)

రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపలేక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు.

శివపురిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి మాత్రం హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పదేపదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. చివరకు శివుడు, విష్ణువు మధ్య కూడా విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంగా కనిపిస్తోందని విమర్శించారు.

“శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే” అని శాస్త్రాలు శివుడు, విష్ణువు మధ్య అభేదాన్ని చెబుతున్నాయని, అలాంటి ఆధ్యాత్మిక సంప్రదాయం ఉన్న దేశంలో ఉత్తర భారతీయులు రామ భక్తులు, దక్షిణ భారతీయులు శివ భక్తులు అంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం సమంజసం కాదన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్లు, మహిళలకు ఆర్థిక భృతి, నిరుద్యోగ భృతి, స్కూటీలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వంటి హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో గణనీయమైన జనాభా, ఆర్థిక ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రజలకు అందుబాటులో లేని పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.

హైదరాబాద్ నగరంలో కనీసం రోడ్లపై గుంతలను పూడ్చలేని పరిస్థితి నెలకొందని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడంలో కూడా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. గత కొన్ని నెలలుగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలకు బదులుగా రాష్ట్ర పరిపాలనపై దృష్టి సారించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని శ్రవణ్ హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నందు యాదవ్, మాజీ కౌన్సిలర్ లీలావతి, మురళి గౌడ్, జోగు వెంకటేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.