prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:04 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

రసాభాసగా రైతు సేవా సహకార సంఘం సర్వసభ్య సమావేశం..రుణమాఫీపై రైతుల నిలదీత.. పాలకవర్గం రాజీనామాకు డిమాండ్..పోలీసుల జోక్యంతో అర్ధాంతరంగా ముగిసిన సమావేశం

ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం 46వ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయించడంలో పాలకవర్గం విఫలమైందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలకవర్గ సభ్యులు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

సోమవారం నారాయణ గార్డెన్స్‌లో సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, వివిధ కారణాలతో మరో రూ.9 వేల కోట్ల మేర రుణమాఫీ జరగాల్సి ఉందని తెలిపారు. స్థానికంగా జరిగిన కొన్ని తప్పిదాల కారణంగానే కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదని వివరించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో రుణమాఫీ అంశంపై బీజేపీ నాయకులు సుధీర్‌రెడ్డిని ప్రశ్నిస్తూ నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో రైతులు, వివిధ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు.

సమావేశంలో సంఘం వైస్‌చైర్మన్ బద్దం అనంత్‌రెడ్డి, సహకార సంఘం ఎండీ రాహుల్‌రాజు, డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, పోచిరెడ్డి, స్రవంతి, మహేందర్, చందుపట్ల ధర్మారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, జడిగె రమేష్, గోపు బాలరాజ్, ఇటికాల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు ఏనుగు సుదర్శన్‌రెడ్డి, బండారి శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.