*రంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే పెయింటింగ్ పనులు చేపట్టాలి*
*రెండేళ్లుగా నిల్వ ఉన్న పెయింట్ డబ్బాలను వినియోగించాలని సర్పంచ్ విజ్ఞప్తి*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్, సెప్టెంబర్ 19:(ప్రజా వాణి )
రంగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలకు రంగులు వేయేందుకు తెచ్చిన పెయింట్ డబ్బాలు దాదాపు రెండేళ్లుగా నిల్వ ఉన్నాయని గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ తెలిపారు.
పాఠశాల భవనాలకు ఇప్పటివరకు రంగులు వేయకపోవడంతో గోడలు పాతబడి, భవనాల రూపురేఖలు దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు. గోడలపై వాల్ పోస్టర్లు తొలగించి, పాఠశాల భవనాలకు అవసరమైన రంగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
పెయింట్ డబ్బాలను అధికారులు వెంటనే పరిశీలించి, వాటి నాణ్యత మరియు గడువును నిర్ధారించాలని, వినియోగానికి అనుకూలంగా ఉంటే ఆలస్యం చేయకుండా పెయింటింగ్ పనులు ప్రారంభించాలని సర్పంచ్ కోరారు. అవసరమైతే గడువు ముగిసిన లేదా వినియోగానికి పనికిరాని పెయింట్‌ను తొలగించి, కొత్త పెయింట్‌ను సమకూర్చి పాఠశాల భవనాలకు రంగులు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులు పాఠశాలలను పరిశీలించి, పెయింటింగ్ పనులకు అవసరమైన నిధులు, సామగ్రి సమకూర్చి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ కోరారు.