prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 3:51 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రంగసముద్రం పంచాయతీలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ ప్రత్యేక చర్యలు: అక్రమ ప్లాట్ల విక్రయదారులపై కఠిన హెచ్చరికలు

పోరుమామిళ్ల సెప్టెంబర్ 01 ప్రజావాణి మండల పరిధిలోని రంగసముద్రం గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ అధికారులు విస్తృతమైన చర్యలు చేపట్టారు.రంగసముద్రం గ్రామంలోని సర్వే నంబర్ 1174/2 కు చెందిన 5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు,సర్వే నంబర్ 1306/1 లోని 5 ఎకరాలు,మరియు పంచాయతీ పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా లేఅవుట్లు (ప్లాట్లు) వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల తహసిల్దార్ కర్నాటి విజయ్ కుమార్(ఎమ్మార్వో) రంగంలోకి దిగి,సదరు వివాదాస్పద ప్రభుత్వ భూముల్లో ప్రజలను హెచ్చరిస్తూ అధికారిక నోటీస్ బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.
ప్రజలకు తహసిల్దార్ హెచ్చరిక – కొనే ముందు సరిచూసుకోండి!
అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని తహసిల్దార్  ప్రజలకు బహిరంగ విజ్ఞప్తి చేశారు. రంగసముద్రం పరిధిలోని వివాదాస్పద సర్వే నంబర్లలో భూములు కొనేందుకు ఆసక్తి ఉన్నవారు లేదా ఏవైనా అనుమానాలు ఉన్నవారు నేరుగా పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయానికి (రెవెన్యూ ఆఫీస్) వచ్చి అధికారులను సంప్రదించాలని కోరారు. అక్కడి రికార్డులను పరిశీలించి పూర్తి వివరణ పొందిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియలు జరుపుకోవాలని, లేనిపక్షంలో మోసపోతే ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
బోర్డులు తొలగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
ప్రభుత్వ భూముల రక్షణ కోసం అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,ఫ్లెక్సీలను ఎవరైనా అక్రమార్కులు లేదా గుర్తు తెలియని వ్యక్తులు పీకివేసినా,ధ్వంసం చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తీవ్రంగా హెచ్చరించారు. భూఆక్రమణదారులకు తావిచ్చేది లేదని,ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పోరుమామిళ్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సుధాకర్ రెడ్డి,విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఓబయ్య, మండల సర్వేయర్ మరియు విలేజ్ సర్వేయర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ప్రజలంతా సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.