యువకుడి దారుణ హత్య ఎస్సారెస్పీ కాలువ వద్ద కలకలం…. హుజురాబాద్ ప్రజావాణి సెప్టెంబర్ : 28 హుజురాబాద్ రూరల్ “హుజూరాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో ఆదివారం రాత్రి నెత్తురోడింది. వివాహేతర సంబంధం నెపంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థి పక్కా స్కెచ్ వేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి కిరాతకంగా హతమార్చాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేశ్(32)ను, అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ హత్య చేసాడు. పథకం ప్రకారం పెద్దపాపయ్యపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు రప్పించి చంపాడా? లేక వేరే ప్రాంతంలో హతమార్చి కెనాల్ వద్దకు తెచ్చి పడేశాడా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిందితుడి భార్యతో రాకేశ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే ఈ దారుణానికి దారి తీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరికొందరి సహకారంతో పకడ్బందీ వ్యూహం రచించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ స్థానిక పోలీసులకు లొంగిపోయినట్లు జోరుగా ప్రచారం సాగుతుండగా, పోలీసులు మాత్రం దీనిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారాలు, వేలిముద్రలను సేకరించింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.