*మెడినోవా హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స.. లేజర్ చికిత్సతో చిన్నారికి ఉపశమనం”
*ఐదేళ్ల చిన్నారి మూత్రనాళంలో 10×8 మి.మీ. రాయి తొలగింపు*
*డా.నితేష్ బత్తాల ఆధ్వర్యంలో విజయవంతమైన చికిత్స”
మేడ్చల్, ప్రజావాణి: ఐదేళ్ల చిన్నారి మూత్రనాళంలో ఏర్పడిన 10×8 మి.మీ. రాయిని మెడినోవా హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. నితేష్ బత్తాల ఆధ్వర్యంలో ఆధునిక వైద్య విధానంతో శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు.
*నొప్పి, వాంతులతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారి*
మెదక్ పట్టణానికి చెందిన ఐదేళ్ల చిన్నారి కుడివైపు నడుము నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట, వికారం, వాంతులతో బాధపడుతూ మెడినోవా హాస్పిటల్‌ను సంప్రదించింది. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కుడివైపు మూత్రనాళం మూత్రాశయంతో కలిసే ప్రాంతంలో 10×8 మి.మీ. పరిమాణంలో రాయి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మూత్రపిండాల్లో ఏర్పడిన రాయి మూత్రనాళం గుండా కిందికి వచ్చి అక్కడ ఇరుక్కుపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులో ఇంత పెద్ద పరిమాణంలో రాయి ఏర్పడటంతో మూత్ర ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించారు.
*లేజర్ చికిత్సతో రాయి తొలగింపు”
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. డా. నితేష్ బత్తాల ఆధ్వర్యంలో యూరెటెరోస్కోప్, లేజర్ లిథోట్రిప్సీ విధానాల ద్వారా మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ ప్రక్రియలో రాయిని పూర్తిగా తొలగించి, మూత్ర ప్రవాహం సజావుగా సాగేందుకు డీజే స్టెంట్‌ను అమర్చారు. చికిత్స విజయవంతం కావడంతో చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అనంతరం వైద్యులు చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
*లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు: డా. నితేష్ బత్తాల*
ఈ సందర్భంగా డా. నితేష్ బత్తాల మాట్లాడుతూ, చిన్నారి వయసును దృష్టిలో ఉంచుకుని మూత్రనాళ ప్రవేశ భాగం సన్నగా ఉండటాన్ని గుర్తించి, తగిన జాగ్రత్తలతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో చికిత్స చేయడంతో చిన్నారి త్వరగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు వివరించారు.
చిన్న వయసులోనే నడుము నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
చిన్నారి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు, మెడినోవా హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్టమైన వైద్య సమస్యలకు అవసరమైన నిపుణులు, ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం మేడ్చల్‌లోని మెడినోవా హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.