*మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలి – ఇంటి నంబర్లు, మౌలిక వసతులు కల్పించాలి*
*జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా – పోలీసులకు, లబ్ధిదారులకు మధ్య తోపులాట*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
జనగామ పట్టణంలో 2012-13లో ఇల్లు లేని 1144 మంది పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు, గృహ రుణాలు ఇవ్వకుండా విస్మరించిందని, ఆ స్థలాల్లో డబల్ బెడ్ రూం ఇండ్లలో నివాసం ఉంటున్న 72 మందికి పట్టాలు ఇవ్వాలని, ఇళ్లకు ఇంటి నంబర్లు వేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి మూకు కనక రెడ్డి మాట్లాడుతూ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడో విడత లబ్ధిదారుల స్థలాలను తీసుకొని డబల్ బెడ్ రూంలు కట్టాలని ప్రయత్నించగా పేదలు కోర్టుకు వెళ్లారని, కోర్టు చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.
2019లో అప్పటి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ లేఅవుట్ వేసి ఇచ్చారని, 2023 జూలైలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లు కలెక్టర్ ఆదేశంతో 72 మందికి డబల్ బెడ్ రూం ఇండ్లకు డ్రా తీసి కేటాయించారని, ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లు కట్టుకున్నారని అన్నారు. 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఇంటి నంబర్లు, కరెంటు, మంచినీరు కల్పించకపోవడం దారుణమన్నారు.
ప్రస్తుత కలెక్టర్ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి మళ్లీ డ్రా తీసి, పట్టాలు ఉన్న అర్హులను విస్మరించడం సరికాదని, పట్టాలు కలిగి డబల్ బెడ్ రూంలలో నివాసం ఉంటున్న పేదలకే పట్టాలు ఇవ్వాలని, జనగామ మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్లు వేసి సీసీ రోడ్డు, కరెంటు, మంచినీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
సుమారు నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగగా, ఇన్ చార్జ్ ఏసీపీ భీమ్ శర్మ విచక్షణారహితంగా మహిళలను, పేదలను ఈడ్చుకెళ్లి డీసీఎంలో పడవేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అనంతరం నాయకులను, లబ్ధిదారులను అరెస్టు చేసి బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి బోట్ల శేఖర్, బూడిది గోపి, సుంచు విజేందర్, పొత్కనూరి ఉపేందర్, ఎండి అజారుద్దీన్, 3వ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి, మూడో విడత లబ్ధిదారుల అధ్యక్షుడు కళ్యాణం లింగం, పట్టణ కమిటీ సభ్యులు శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.