మార్కాపురం జిల్లాలో సెప్టెంబర 8 ప్రజావాణి గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ రేషన్ షాపులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు (బాలురు మరియు బాలికల) రెసిడెన్షియల్ స్కూల్స్ , కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఎస్సీ మరియు ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సిందేనని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు హాస్టళ్లలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదని గుర్తించి వార్డెన్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంభం గర్ల్స్ హైస్కూల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుడ్లు పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పెట్టాల్సిన ఆహారాన్ని, కోడిగుడ్లను స్వాహా చేస్తూ కొందరు వార్డెన్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల కడుపు కొడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.మరోవైపు, కందులాపురం అంగన్వాడీ కేంద్రంలో ఆయా ప్రవర్తన సరిగా లేదంటూ స్థానిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు ఆమెను విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో హాస్టల్ మెనూ చార్జీల సంబంధించిన ధరలను 10 శాతం మేర పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.