మానవత్వాన్ని చాటుకున్న ప్రెస్ క్లబ్ : నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ.
కోదాడ, సెప్టెంబర్ 16/ ప్రజావాణి
కోదాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన చెరువు కట్ట బజారులో వున్న ఎండి రహమత్ వెన్నుపూస సమస్య, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక నిరుపేద ఇంటి యజమాని కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, దాతలు మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎస్టిఆర్ బాలు, కోదాడ పట్టణంలోని రామాలయం గుడి అర్చకులు కాండూరి వంశీకృష్ణ చార్యుల సహకారంతో నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు.తీవ్ర అనారోగ్యం కారణంగా ఎండి నుస్రత్ కుటుంబ యజమాని ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ భారంగా మారిన విషయాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్తించారు. ఈ క్రమంలో దాతల సహాయాన్ని కూడగట్టి, ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వారికి నెల రోజులకు సరిపడా బియ్యం (రైస్) తో పాటు వంట నూనె, పప్పులు, కారం, ఉప్పు వంటి వివిధ రకాల కిరాణా సరుకులను ప్రెస్ క్లబ్ ప్రతినిధులు స్వయంగా వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం అంజి మాట్లాడుతూ.. సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అందరి బాధ్యతని, అనారోగ్యంతో ఉన్న ఆ కుటుంబానికి తమ వంతు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. తమ పిలుపునకు స్పందించి సరుకుల పంపిణీకి సహకరించిన దాతలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమకు సరుకులు అందించి ఆదుకున్నందుకు ఎండి రహమత్ నిరుపేద కుటుంబ సభ్యులు ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు, దాతలకు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బాణాల అబ్రహము ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు కోశాధికారి నూరుద్దీన్ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, జగన్మోహన్రావు, రహీం, వెంకటేశ్వర్లు, రమేష్, గోపీచంద్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.