మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి మృతి.. ఈటల రాజేందర్, మైనంపల్లి సంతాపం
దేవరయాంజాల్, ఉమ్మడి శామీర్‌పేట్ మండల అభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం
శామీర్‌పేట్: దేవరయాంజాల్ మాజీ సర్పంచ్, ఉమ్మడి శామీర్‌పేట్ మండల మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
నాలుక యాదగిరి మృతి చెందడం చాలా బాధాకరమని వారు పేర్కొన్నారు. దేవరయాంజాల్ గ్రామంతో పాటు ఉమ్మడి శామీర్‌పేట్ మండల ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.
నాలుక యాదగిరి ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారని, గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆయన మృతి దేవరయాంజాల్ గ్రామంతో పాటు ఉమ్మడి శామీర్‌పేట్ మండల ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయన లేని లోటును పూడ్చలేమని విచారం వ్యక్తం చేశారు.
అనంతరం నాలుక యాదగిరి అంతిమయాత్ర నిర్వహించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాలుక యాదగిరికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.