మహారాజా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

రూ.67 వేలకు వినాయకుడి లడ్డూ వేలం.. దక్కించుకున్న పానుగంటి బాలమణి
డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి గణనాథుడు
మేడ్చల్, నేడు న్యూస్: మహారాజా యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో పానుగంటి బాలమణి రూ.67 వేలతో వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి నెలకొంది.
అనంతరం మహిళలు, యువకులు, బాలురు పెద్ద సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు నృత్యాలు చేస్తూ, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. చివరగా గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చి ఘనంగా నిమజ్జనం చేశారు.
మహారాజా యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తుల ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువకులు, బాలురు, మహారాజా యూత్ సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.