- మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం
బీర్కూర్: మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివారం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డా. విజయ్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు తదితర సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల స్వచ్ఛతను తప్పనిసరిగా పాటించాలని, ప్రతిరోజూ శుభ్రంగా ఉండాలని తెలిపారు. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడంతో పాటు శుభ్రమైన ఆహారం, తాగునీటిని తీసుకోవాలని సూచించారు.
అనంతరం పాఠశాలలోని వంటగది, భోజనాన్ని వైద్యాధికారి పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సను అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గోపీచంద్, వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.