prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 9:45 am Digital Edition : PRAJA VANI

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు<br>

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక నిఘా

తిరుపతి, సెప్టెంబర్‌ 1: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనల అమలుపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 10 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. ఒక్కో కేసుకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,00,000 జరిమానా విధించారు. మరో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసులో రూ.300 జరిమానా విధించడంతో మొత్తం రూ.1,00,300 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో ఒక కేసులో 7 రోజుల కమ్యూనిటీ సర్వీస్‌ కూడా విధించబడింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం కేవలం ట్రాఫిక్‌ ఉల్లంఘన మాత్రమే కాదని, వాహనం నడిపే వ్యక్తితో పాటు రోడ్డుపై ప్రయాణించే అమాయక ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టే చర్య అని అన్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని జీవితాంతం విషాదంలోకి నెట్టే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

“మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తుంది. అదే విధంగా రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరాలి. మద్యం సేవించి వాహనం నడపకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడండి” అని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం వంటి ప్రమాదకర ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.