prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:32 pm Digital Edition : NARESH HUZURNAGAR

మద్యం మత్తులో టీచర్‌,పాఠశాలలో కలకలం,టీచర్‌కు డ్రింకింగ్ టెస్ట్‌,196గా నమోదైనట్లు సమాచారం

నేరేడుచర్ల, ప్రజావాణి:
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవించిన స్థితిలో ఉన్నారన్న సమాచారంతో, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు సమాచారం.

డ్రింకింగ్ టెస్ట్‌లో 196గా నమోదైనట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సదరు ఉపాధ్యాయుడికి డ్రింకింగ్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో 196 విలువ నమోదైనట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక పరీక్షా నివేదిక, పోలీసుల ధ్రువీకరణ అందుబాటులోకి రావాల్సి ఉంది.

రెండేళ్లుగా ఆరోపణలు?

సదరు ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు మందలించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారుల సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

విద్యార్థుల భద్రతపై ఆందోళన.

ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు అధికారికంగా నిర్ధారణ అయితే, పాఠశాల క్రమశిక్షణతో పాటు విద్యార్థుల విద్యాభ్యాసం, భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఎంఈఓ వివరణ.


ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బాలు నాయక్‌ను ఫోన్‌లో వివరణ కోరగా, సంబంధిత ఉపాధ్యాయుడికి షోకాజ్‌ మెమో జారీ చేసి, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.