prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 12:30 pm Digital Edition : PRAJA VANI

మట్టి గణపతే మేలుబాట.. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల బాట!

మట్టి గణపతే మేలుబాట.. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల బాట

 

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు గుడ్‌బై.. మట్టి వినాయకుడి పూజకు సుజాత విద్యానికేతన్ పిలుపు

 

హసన్‌పర్తి,రిపోర్టర్ ప్రణయ్ గొర్రె,సెప్టెంబర్ 8:

“మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో సుజాత విద్యానికేతన్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మట్టి వినాయకుడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో మట్టి వినాయక ప్రతిజ్ఞ చేయించారు.

 

కాలుష్యానికి చెక్.. మట్టి గణపతికి స్వాగతం

 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ మాట్లాడుతూ వినాయక నవరాత్రి వేడుకలు భక్తి, ఆనందాలకు ప్రతీకలని అన్నారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమై జలచరాలు, పశుపక్షాదులు, మానవాళికి హాని కలుగుతోందని తెలిపారు.

 

మట్టి గణపతి ఆరాధన సనాతన ధర్మానికి, ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మట్టి వినాయకుడిని పూజించడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదని, భూమాత పట్ల మనకున్న కృతజ్ఞతను చాటే గొప్ప బాధ్యత అని అన్నారు.

 

30 ఏళ్లుగా పర్యావరణహిత కార్యక్రమాలు

 

సుజాత విద్యానికేతన్ పర్యావరణహిత పాఠశాలగా గత 30 ఏళ్లుగా మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఎన్‌జీసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సుమారు 1,500 మట్టి వినాయక విగ్రహాలను విద్యార్థుల చేత తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

 

ఇప్పటివరకు సుమారు 35 వేలకుపైగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీ, ర్యాలీల ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

 

“ఇంటింటా మట్టి గణపతి.. ప్రతి మనసులో పర్యావరణ స్పృహ”

విద్యార్థులు తమ ఇళ్లలో మట్టి వినాయక విగ్రహాలను పూజించి ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.

 

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు “మట్టి వినాయకుడు–పర్యావరణానికి రక్షకుడు”, “పర్యావరణాన్ని కాపాడుదాం–మట్టి వినాయకుడిని పూజిద్దాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.

 

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రకృతి రక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తూ, భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. 🙏

 

ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు, ఏ. వెంకట్, రాధాకుమారి, మానస, అరుణ, గీత, జి. సంధ్య, సిహెచ్. సంధ్య, దేవిక, స్వప్న, సరిత, ప్రవళిక, లావణ్య, దివ్యరాణి, సుచిత్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు