*మంచాలలో విద్యుత్ సమస్యలపై రైతుల ఆందోళన*
*పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు.. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మండలం. మంచాల. , సెప్టెంబర్ 22 (ప్రజావాణి):
మంచాల మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు సకాలంలో సాగునీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ అంతరాయాలు తీవ్ర సమస్యగా మారాయని పేర్కొన్నారు. పంటలకు నీరు అందించాల్సిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులకు విద్యుత్ సమస్యల కారణంగా మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని తెలిపారు.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని, తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సాంకేతిక సమస్యలను అధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
రైతుల సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించి పంటలకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే రైతుల తరఫున ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మంచాల గ్రామ కార్యదర్శి దూసరి సత్తయ్య, శాఖ సభ్యులు ఏర్పుల యాదయ్య, చీర కొమురయ్య, ఏర్పుల కృష్ణ, నరసింహ, ఏడుపుల బాలరాజ్, శివకుమార్, రమేష్, వర్గాల ప్రభాకర్, గడ్డం దర్శన్, జంగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.