prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 1:50 pm Digital Edition : PRAJA VANI

భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

పాల నురగలా జాలువారుతున్న జలధారలు.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న తెలంగాణ నయాగరా

వాజేడు, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. సుమారు 50 మీటర్ల ఎత్తు నుంచి పాల నురగలా జాలువారుతున్న జలధారలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది.
భద్రతా కారణాలతో స్నానాలకు నిషేధం
జలపాతం వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈతకొలనులోకి దిగడం, జలపాతంలో స్నానాలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పర్యాటకులు దూరం నుంచే జలపాతం అందాలను వీక్షించేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. సందర్శకులు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.