బీజేపీ అధికారంలోకి వస్తే సంగెం పీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చుతా
సెప్టెంబర్ 28.ప్రజావాణి న్యూస్ /సంగెం
సంగెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కలిప్రసాద్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దామెరుప్పుల చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆయన సోమవారం సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి,రోగులకు అందుతున్న వైద్య సేవలను మరియు ఆసుపత్రిలోని వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ కలిప్రసాద్ రావు మాట్లాడుతూ సంగెం మండలంలో స్థానిక సమస్యలు రాజ్యమేలుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ముఖ్యంగా మండల కేంద్రంలోని ఆసుపత్రిలో వైద్యులు,పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని,అత్యవసర మందులు,ఇన్సులిన్ వంటివి అందుబాటులో లేక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తమ పార్టీకి విద్యా, వైద్య రంగాలే ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల పాలనను చూశారని, ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే సంగెం మండలాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.సంగెం మండలంలో రోడ్ల దుస్థితి, మౌలిక వసతుల లేమిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలంలోని పలు గ్రామాల్లో అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారి దోమల వ్యాప్తితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు.కొన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు.పేదలకు దక్కాల్సిన ఇందరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని,అర్హులను పక్కనబెట్టి కేవలం తమ పార్టీ అనుచరులకే ఇళ్లను ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కోట్లకు పడగలెత్తుతున్నారే తప్ప, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎల్గుర్ రంగంపేట సర్పంచ్ బెజ్జంకి శేషాద్రి,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రహ్మతుల్లా,జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమారస్వామీ,గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవి,మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్,దాసరి కుమారస్వామీ,బోగా కోటేశ్వర్,సారమ్మనాలం చంద్రశేఖర్,కర్ణాకర్, రంగరాజు కృష్ణ, దోమల రవి యాదవ్, అల్లం కుమారస్వామి, రమణ, రమణచారి, పండుగా రాజు, కుమారస్వామి, బెజ్జంకి రాజు, న్యాల రమేష్ గుల్లపల్లి శీను నరసయ్య ఎల్ల గౌడు రాంబాబు, మెంతుల రాజేందర్,ఓదెల శంకర్,హింగే మురళి,దామెరూప్పుల వీరేష్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.