prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 7:49 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఉన్మాద చర్యల తీరుపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఉన్మాద చర్యల తీరుపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

అసెంబ్లీలో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

 

 

తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో మహిళా ఎమ్మెల్యేలు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు తీవ్రంగా బాధించిందని అన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న ప్రదేశంలో చొక్కాలు విప్పుకుని బహిరంగంగా నిరసన వ్యక్తం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇది అత్యంత సిగ్గుచేటైన ఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికపై సభ్యులు తమ నిరసనను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యక్తం చేయాలని, కానీ హద్దులు దాటి అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అదేవిధంగా శాసనసభ స్పీకర్‌ను అసభ్యకరమైన పదజాలంతో దూషించడం మరింత బాధ కలిగించిందని యశస్విని రెడ్డి అన్నారు. సభకు అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క శాసనసభ్యుడిపై ఉందని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన అంశాలను తేలికగా తీసుకోకూడదని, అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మహిళా సాధికారత, మహిళల గౌరవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, మహిళలను అవమానించే ఎలాంటి ప్రవర్తననైనా సహించేది లేదని యశస్విని రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.