prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 6:37 pm Digital Edition : MAHESH MEDCHAL

బాల్యమిత్రుడి వైద్యానికి రూ.1.04 లక్షల ఆర్థిక సాయం

*బాల్యమిత్రుడి వైద్యానికి రూ.1.04 లక్షల ఆర్థిక సాయం*

*క్యాన్సర్‌తో బాధపడుతున్న తోటి విద్యార్థికి అండగా 1999–2000 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు*

ఘట్కేసర్, (ప్రజావాణి):- ఆపదలో ఉన్న బాల్యమిత్రుడికి అండగా నిలిచి 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న తమ తోటి విద్యార్థికి రూ.1,04,000 ఆర్థిక సహాయం అందించి స్నేహబంధాన్ని చాటుకున్నారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999–2000 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. తమతో కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు పోలోజి కిరణ్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మిత్రులంతా స్పందించారు.

వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చుల నిమిత్తం తమవంతు సహాయం అందించాలని నిర్ణయించుకుని, అందరూ కలిసి రూ.1,04,000 (లక్షా నాలుగు వేల రూపాయలు) ఆర్థిక సాయాన్ని సమకూర్చి అందజేశారు. కష్టకాలంలో తోటి మిత్రుడికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని మరోసారి చాటుకున్నారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. తమతో కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు పోలోజి కిరణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. స్నేహం అనేది కేవలం చదువుకునే రోజుల్లోనే కాకుండా, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లోనూ తోడుగా నిలవడమేనని పేర్కొన్నారు.

ఆపదలో ఉన్న మిత్రుడికి ఆర్థిక సహాయం అందించిన 1999–2000 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు. ఈ సహాయం కిరణ్ వైద్య చికిత్సకు తోడ్పడటంతో పాటు, స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది.