prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:20 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ పోరుమామిళ్ల టు గిద్దలూరు: నిబంధనలు తుంగలో తొక్కి ‘అధిక లోడు’తో ఇసుక దందా

కడప జిల్లా సెప్టెంబర్ 06 ప్రజావాణి బద్వేల్ నుండి పోరుమామిళ్ల వైపు నుంచి ప్రకాశం జిల్లా సరిహద్దులోని కొమ్మురోలు, గిద్దలూరు ప్రాంతాలకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. లారీలు, భారీ టిప్పర్లలో సామర్థ్యానికి మించి, ఏకంగా కొండల్లా ఇసుకను నింపి (ఓవర్‌లోడింగ్) తరలిస్తున్నారు. పచ్చటి పల్లెలు, ప్రధాన రహదారులు ఇసుక లారీల ధూళితో, మితిమీరిన వేగంతో అట్టుడుకుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా , పోలీసు, గనుల శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు గాల్లోకి.. గ్రీన్ కవర్ల ముసుగులో మాయాజాలం!

నిజానికి సుప్రీంకోర్టు, ఎన్జీటీ  నిబంధనల ప్రకారం ఇసుకను రవాణా చేసేటప్పుడు వాహనాలపై లీకేజీలు లేకుండా గట్టిగా కవర్లు కప్పాలి. కానీ, ఈ మార్గంలో తిరిగే లారీలు పైన కేవలం ఒక పచ్చటి కవర్ (తార్పాలిన్) వేసి కంటితుడుపుగా చూపిస్తున్నారు. లోపల మాత్రం లారీ బాడీ సామర్థ్యం కంటే రెట్టింపు స్థాయిలో ఇసుకను గుట్టలుగా పోస్తున్నారు. దీనివల్ల వాహనం ప్రయాణిస్తున్నప్పుడు వెనుక నుంచి ఇసుక రేణువులు గాల్లోకి లేచి, వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్లలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రాణాలు తీస్తున్న ఓవర్‌లోడ్.. ధ్వంసమవుతున్న రహదారులు

పరిమితికి మించిన లోడుతో ఈ భారీ వాహనాలు గ్రామీణ రోడ్లపై నడవడం వల్ల ఇటీవలే నిర్మించిన రోడ్లు కుంగిపోతున్నాయి. గుంతలమయంగా మారుతున్న దారుల వల్ల సామాన్య ప్రజలు ప్రయాణించాలంటేనే జంకుతున్నారు.నిత్యం ప్రమాదాల భయం: అతి బరువు వల్ల ఈ భారీ వాహనాల టైర్లు పేలడం లేదా బ్రేకులు ఫెయిల్ అవ్వడం జరుగుతోంది. పోరుమామిళ్ల, కొమ్మురోలు ఘాట్ రోడ్డు మలుపుల్లో ఇవి అదుపు తప్పి బోల్తా పడితే సామాన్యుల ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. రహదారి భద్రత శూన్యం: ఇరుకైన రోడ్లపై ఈ ఇసుక రాక్షసులు ఎదురెదురుగా వస్తుంటే చిన్న వాహనాలు పక్కకు తప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోతోంది.

అధికారుల ‘మామూళ్ల’ నిద్ర?

అక్రమ ఇసుక రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, వే బిల్లులు  లేని వాహనాలకు భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే, పోరుమామిళ్ల నుంచి గిద్దలూరు వెళ్లే దారిలో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ, ఈ ఓవర్‌లోడ్ లారీలు ఎలా దాటిపోతున్నాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రవాణా శాఖ అధికారులు కేవలం కొన్ని చోట్ల నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని, లోపాయికారీ ఒప్పందాలతోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా కడప, ప్రకాశం జిల్లాల ఉన్నతాధికారులు కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులు) ఉమ్మడిగా స్పందించాలి.

1. ఈ మార్గంలో ప్రత్యేక నిఘా బృందాలను, ఏర్పాటు చేయాలి.

2. కవర్ల ముసుగులో తరలిస్తున్న ఓవర్‌లోడ్ ఇసుక వాహనాలను సీజ్ చేసి, మైనింగ్ చట్టాల ప్రకారం కఠినమైన జరిమానాలు, కేసులు నమోదు చేయాలి.

3. పగలు, రాత్రి సాగుతున్న ఈ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, రోడ్లను మరియు ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.