prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 1:40 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండానే భూమి ఆన్‌లైన్ మార్పు?బొప్పాపురంలో రెవెన్యూ రికార్డులపై వివాదం.. సమగ్ర విచారణ కోరుతున్న బాధితుడు

కడప జిల్లా పోరుమామిళ్ల,సెప్టెంబర్ 15 ప్రజావాణి పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల రెవెన్యూ రికార్డుల నిర్వహణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోరుమామిళ్ల మండలం బొప్పాపురం గ్రామంలో 1987లో డీకేటీ పట్టా కింద మంజూరైన భూమికి సంబంధించి ఆన్‌లైన్ రికార్డుల మార్పుపై తీవ్ర వివాదం నెలకొంది. అర్హులైన వారసులందరి అంగీకారం లేకుండా, కనీసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా లేకుండానే భూమిని ఒకరి పేరుపైకి ఆన్‌లైన్ లో మార్చేశారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.బాధితుడు చాటకొండ ఆనందరావు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పాపురం గ్రామంలోని సర్వే నంబర్ 187-1లో 15-08-1987న డీకేటీ పట్టా కింద 1.79 ఎకరాల భూమి తమ తల్లి చాటకొండ జీవమ్మ పేరు మీద మంజూరైంది. ఈ భూమికి సంబంధించి చాటకొండ జీవమ్మకు ముగ్గురు సంతానం ఉన్నారు. తల్లి తర్వాత ఆ భూమిపై ముగ్గురు వారసులకు సమాన హక్కు ఉంటుంది.అయితే తమ కుటుంబంలోని ఒక వ్యక్తి ఎలాంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేదా ఇతర వారసత్వ ఆధారాలు, మిగిలిన వారసుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించకుండానే రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయించుకుని ఆన్‌లైన్‌లో భూమిని తన పేరు మీదకు మార్చుకున్నారని ఆనందరావు ఆరోపించారు.

నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ జరిగిందా?

సాధారణంగా డీకేటీ భూమి పట్టాదారు చనిపోయిన తర్వాత, వారసత్వంగా భూమిని మార్చాలంటే తప్పనిసరిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, వారసులందరి ఆధార్ కార్డులు, డెత్ సర్టిఫికెట్, మిగిలిన వారసుల అంగీకార పత్రం, విఆర్వో విచారణ రిపోర్టు, పబ్లిక్ నోటీసు వంటివి ఉండాలి. కానీ ఈ కేసులో అలాంటి ప్రక్రియ ఏదీ పాటించకుండానే నేరుగా ఆన్‌లైన్ ఎంట్రీ చేసేశారని బాధితుడు చెబుతున్నాడు.ఈ వ్యవహారంపై ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాలేదని, న్యాయం జరగలేదని ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాజాగా పోరుమామిళ్ల డిప్యూటీ తాసిల్దార్ కు లిఖితపూర్వకంగా అర్జీ ఇవ్వడం జరిగింది.

పరిశీలించాల్సిన కీలక అంశాలు:

ఈ వివాదంలో అధికారులు పరిశీలించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.

1. 1987 నాటి అసలు డీకేటీ అసైన్మెంట్ రిజిస్టర్ లో పట్టాదారు ఎవరు?
2. వారసత్వ మార్పు కోసం ఇచ్చిన దరఖాస్తు ఎక్కడ? దానిపై ఎవరు సంతకం చేశారు?
3. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రాలు ఉన్నాయా? ఉంటే ఎవరు జారీ చేశారు?
4. మిగిలిన ఇద్దరు వారసులకు నోటీసులు ఇచ్చారా? వారి అంగీకారం తీసుకున్నారా?
5. విఆర్వో, ఆర్ఐ విచారణ నివేదికలు ఉన్నాయా?
6. ఏ ఆధారాలతో, ఏ అధికారి లాగిన్ తో ఆన్‌లైన్ లో మ్యూటేషన్ చేశారు?

అన్ని వారసులకు హక్కు ఉన్న సందర్భంలో,మిగిలిన వారసుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కరి పేరుపై రికార్డు మార్పు చేయడం రెవెన్యూ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.

రీ-సర్వే నేపథ్యంలో హోల్డ్ చేయాలని వినతి:

ప్రస్తుతం ఈ సర్వే నంబర్ 187-1 పై రీ-సర్వే జరుగుతున్న నేపథ్యంలో, వివాదం పరిష్కారం అయ్యే వరకు ఈ భూమిని ఎలాంటి మార్పులు చేయకుండా హోల్డ్ లో పెట్టాలని, ఫోన్ లో పెట్టాలని బాధితుడు డిప్యూటీ తాసిల్దార్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ (జేసీ), బద్వేలు ఆర్డీవో స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, పాత డీకేటీ రికార్డులు, అసైన్‌మెంట్ రిజిస్టర్, కుటుంబ వారసుల వివరాలు, మ్యూటేషన్ దరఖాస్తు, ఆన్‌లైన్ ఎంట్రీకి ఆధారమైన పత్రాలు పరిశీలించాలని ఆనందరావు విజ్ఞప్తి చేశారు.నిజంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదా సరైన వారసత్వ ఆధారాలు లేకుండానే రికార్డు మార్చి ఉంటే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని, అర్హులైన పేద వారసుల హక్కులను కాపాడాలని ఆయన కోరుతున్నారు.